Courses: ఇంటర్ తర్వాత ఈ కోర్సులో జాయిన్ అయితే బ్రైట్ కెరీర్.. ఓ లుక్కేయండి..!

Courses: ఇంటర్ తర్వాత ఈ కోర్సులో జాయిన్ అయితే బ్రైట్ కెరీర్.. ఓ లుక్కేయండి..!

ఇంటర్‌ తర్వాత ఒకే అడ్మిషన్‌ ప్రక్రియతో.. యూజీ(అండర్‌ గ్రాడ్యుయేట్‌), పీజీ కోర్సుల్లో ప్రవేశాన్ని ఖరారు చేసుకోవచ్చు! అదే.. ఇంటిగ్రేటెడ్‌ పీజీ కోర్సుల విధానం!!

ప్రస్తుతం ఐఐటీలు, ఐఐఎంలు సహా ఎన్నో ఇన్‌స్టిట్యూట్‌ల్లో ఇంటిగ్రేటెడ్‌ పీజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నారు. ఇంటిగ్రేటెడ్‌ చాలా రకాల సబ్జెక్టుల్లో రూపుదిద్దుకున్నాయి.

బిట్స్‌ పిలానీ, జేఎన్‌టీయూ లాంటి ఎన్నో కళాశాలల్లో ఇంటిగ్రేటెడ్‌ బీటెక్‌ ప్రోగ్రామ్స్‌ అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ లాంటివి ఇంటిగ్రేటెడ్‌ సైన్స్‌ కోర్సులు ఆఫర్‌ చేస్తున్నాయి. ఇంటిగ్రేటెడ్‌ మ్యాథమెటిక్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ ఇలా ఎన్నో ఉన్నాయి.

అయిదేళ్ల వ్యవధి ఉండే ఇంటిగ్రేటెడ్‌ పీజీ ప్రోగ్రామ్‌లలో అడుగుపెట్టిన విద్యార్థులు.. తొలి మూడేళ్లు బ్యాచిలర్‌ డిగ్రీ స్థాయి సబ్జెక్టులను చదవాల్సి ఉంటుంది.

ఆ తర్వాత రెండేళ్లు పీజీ స్థాయి సబ్జెక్టులను అభ్యసించాలి. తొలి మూడేళ్లు బ్యాచిలర్‌ డిగ్రీ స్థాయి సబ్జెక్టులను అభ్యసించిన విద్యార్థులు.. పీజీ స్థాయిలో అందుబాటులో ఉన్న స్పెషలైజేషన్లలో ఏదో ఒకదాన్ని ఎంపిక చేసుకోవచ్చు.

మూడేళ్ల తర్వాత బ్యాచిలర్‌ డిగ్రీ సర్టిఫికెట్, అయిదేళ్ల తర్వాత పీజీ సర్టిఫికెట్‌ లభిస్తుంది. మూడేళ్ల తర్వాత పీజీ ప్రోగ్రామ్‌లో కొనసాగడం ఇష్టం లేకపోతే.. బ్యాచిలర్‌ డిగ్రీ సర్టిఫికెట్‌ అందుకోవచ్చు.

టెక్నికల్, మేనేజ్‌మెంట్‌ కోర్సుల విషయంలో ప్రపంచ వ్యాప్త గుర్తింపు పొందిన ఐఐటీలు, ఐఐఎంలు కూడా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఇంటిగ్రేటెడ్‌ పీజీ విధానాన్ని ఆవిష్కరిస్తున్నాయి.

ఐఐఎం–ఇండోర్, రోహ్‌తక్, రాంచీ, జమ్ము, బోద్‌గయలు అయిదేళ్ల వ్యవధిలో ఇంటిగ్రేటెడ్‌ పీజీ ప్రోగ్రామ్‌ ఇన్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సును అందిస్తున్నాయి. ఐఐటీ–చెన్నై ఇంటిగ్రేటెడ్‌ ఎంఏ కోర్సును అందుబాటులోకి తెచ్చింది. ఐఐటీ–ఖరగ్‌పూర్‌ ఇంటిగ్రేటెడ్‌ బీటెక్‌+ఎంబీఏ ప్రోగ్రామ్‌ను అందిస్తోంది.

ఐఐటీ–కాన్పూర్, రూర్కీలు కూడా ఈ తరహా ప్రోగ్రామ్‌లను అందిస్తున్నాయి. అటు సెంట్రల్ యూనివర్సిటీలు, రాష్ట్రాల స్థాయిలోని యూనివర్సిటీలు.. సైన్స్ విభాగంలో.. ఇంటిగ్రేటెడ్ బీఎస్సీ+ఎంఎస్సీ లాంటి ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సులను అందిస్తున్నాయి. వీటిద్వారా విద్యార్థులకు ఐ.ఎమ్మెస్సీ పేరుతో సర్టిఫికెట్ లభిస్తోంది.

ఈ విధానంలో ఎమ్మెస్సీ పూర్తి చేసిన విద్యార్థులకు.. సదరు యూనివర్సిటీలోనే పీహెచ్‌డీ ప్రవేశంలో ప్రాధాన్యం ఇస్తున్నాయి.

ఇంటర్ ఏ గ్రూప్ వారైనా ఈ కోర్సుల్లో చేరవచ్చు. కాకపోతే సైన్స్ సబ్జెక్టులతో ఇంటర్ చదివిన అభ్యర్థులు బీటెక్/ఎంటెక్/ ఎంఎస్ లాంటి కోర్సులు చేయవచ్చు. ఆర్ట్స్, కామర్స్ సబ్జెక్టులతో ఇంటర్ చదివినవారు బీఏఎల్ఎల్‌బీ, ఇంటిగ్రేటెడ్ ఎంఏ/ ఎంబీఏ తదితర కోర్సుల్లో చేరవచ్చు.

Leave a comment