Super Scheme: ఈ స్కీమ్ సూపర్ హిట్… భార్యాభర్తలు ప్రతీ నెలా రూ.41,000 పొందే అవకాశం

Super Scheme: ఈ స్కీమ్ సూపర్ హిట్… భార్యాభర్తలు ప్రతీ నెలా రూ.41,000 పొందే అవకాశం

Super Scheme | కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న స్కీమ్ సూపర్ హిట్ అయింది. భార్యాభర్తలు ప్రతీ నెలా రూ.41,000 పొందే అవకాశం ఈ స్కీమ్‌తో లభిస్తుంది.

కేంద్ర ప్రభుత్వం ప్రజల కోసం అనేక పథకాలను రూపొందిస్తూ ఉంటుంది. నేరుగా లబ్ధిదారులకు నగదు బదిలీ చేసేవి కొన్ని పథకాలు ఉంటే, ప్రజల నుంచి పెట్టుబడులు తీసుకొని, వాటికి మంచి వడ్డీ ఇచ్చే స్కీమ్స్ కొన్ని ఉంటాయి. వీటిని చిన్నమొత్తాల పొదుపు పథకాలు (Small Savings Schemes) అని కూడా అంటారు. చిన్నమొత్తాల పొదుపు పథకాల్లో కూడా కొన్ని పాపులర్ స్కీమ్స్ ఉన్నాయి. వాటిలో డబ్బులు దాచుకునేందుకు ప్రజలు ఎక్కువగా పోటీపడుతుంటారు.

అలాంటి పాపులర్ స్కీమ్‌లో ఒకటి సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ (Senior Citizens Savings Scheme). ఇటీవల వడ్డీ రేట్లు పెరగడం, బడ్జెట్‌లో ఈ పథకానికి సంబంధించి కొన్ని మార్పులు చేయడంతో ఇందులో డబ్బులు దాచుకునేవారి సంఖ్య పెరుగుతోంది.

గతంలో సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్‌లో గరిష్టంగా రూ.15 లక్షల మాత్రమే పెట్టుబడి పెట్టే అవకాశం ఉండేది. కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరిలో ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో ఈ లిమిట్‌ను రూ.30 లక్షలకు పెంచింది. పెరిగిన లిమిట్ ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వచ్చింది. సరిగ్గా అప్పుడే కేంద్ర ప్రభుత్వం చిన్నమొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేటును కూడా పెంచింది. దీంతో 8 శాతంగా ఉన్న వడ్డీ రేటు 8.20 శాతానికి పెరిగింది. ప్రస్తుతం కూడా ఇదే వడ్డీ లభిస్తోంది.

పెట్టుబడికి లిమిట్ పెంచడం, వడ్డీ రేటు పెరగడంతో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ మధ్య సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్‌లోకి పెట్టుబడులు భారీగా పెరిగాయని వార్తలొస్తున్నాయి. ఈ మూడు నెలల్లోనే, ఈ పథకంలోకి రూ.55,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. బిజినెస్ టుడే టీవీ కథనం ప్రకారం మూడు నెలల్లోనే 6.52 లక్షల కొత్త అకౌంట్లు ఓపెన్ చేశారు. గతేడాది ఇదే కాలంలో 2.96 లక్షల కొత్త అకౌంట్లు మాత్రమే ఓపెన్ అయ్యాయి. అంటే గతేడాది కన్నా మూడు రెట్లు ఎక్కువగా అకౌంట్లు ఓపెన్ చేసినట్టు ఈ లెక్కలు చూస్తే అర్థం అవుతుంది.

కేంద్ర ప్రభుత్వం 2004లో వృద్ధుల కోసం సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ ప్రారంభించింది. రిటైర్మెంట్ తర్వాత వచ్చే డబ్బుల్ని ఈ పథకంలో పొదుపు చేసి ప్రతీ నెలా వడ్డీ పొందేందుకు ఉపయోపడే స్కీమ్ ఇది. బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్స్, ఇతర పొదుపు పథకాలతో పోలిస్తే సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్‌లో వడ్డీ ఎక్కువగా వస్తుంది. అందుకే ఈ పథకంలో డబ్బులు దాచుకునేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.

ఈ పథకంలో 60 ఏళ్లు దాటిన వృద్ధులు చేరొచ్చు. ఈ స్కీమ్‌లో ఐదేళ్ల వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఆ తర్వాత మరో 3 ఏళ్లు పొడిగించవచ్చు. ఈ పథకంలో భార్యాభర్తలు పెట్టుబడి పెట్టడం ద్వారా గరిష్టంగా నెలకు రూ.41,000 వరకు తమ అకౌంట్‌లోకి పొందొచ్చు. ఉదాహరణకు ఈ పథకంలో ఒకరు రూ.30 లక్షలు పొదుపు చేసే అవకాశం ఉంది. కాబట్టి భార్యాభర్తలు ఇద్దరూ కలిసి రూ.60 లక్షలు జమ చేశారని అనుకుందాం. వారికి ప్రతీ ఏటా రూ.4,92,000 వడ్డీ వస్తుంది. అంటే నెలకు రూ.41,000 వడ్డీ వస్తుంది.